schedule Friday, June 05, 2026

అందరి సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం:-కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

calendar_today June 5, 2026
person Prajagalam News
అందరి సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం:-కుల్కచర్ల ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

(ప్రజాగళం,కుల్కచర్ల) అందరి సహకారం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని,పర్యవరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్,ఎంపీడీవో రామకృష్ణ నాయక్ అన్నారు.శుక్రవారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ దేశ్ ముఖ్ చంద్ర భూపాల్ రావు అధ్యక్షతన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. భూభాగంలో కనీసం 33 శాతం మేర చెట్ల సంపద ఉండేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ సర్పంచ్ దేశ్ చంద్ర భూపాల్ రావు మాట్లాడుతూ ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్థాయి అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలతో కలిసి పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, గ్రామస్థాయి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.