schedule Friday, June 19, 2026

రైతులు పప్పు ధాన్యాలు పండించేందుకు మొగ్గు చూపాలి

calendar_today June 18, 2026
person Prajagalam News
రైతులు పప్పు ధాన్యాలు పండించేందుకు మొగ్గు చూపాలి
  వికారాబాద్ ఏఎంసి చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ వికారాబాద్-: రైతులు పప్పు ధాన్యాలు పండించేందుకు మొగ్గు చూపాలని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (MANP) పథకం కింద కందుల మినీకిట్ల పంపిణీ కార్యక్రమం గురువారం వికారాబాద్ ఏఎంసి కార్యాలయం వద్ద ఏఎంసి ఛైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రైతులకు కంది విత్తనాలు మినీ కిట్ల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ... పప్పుధాన్యాల ఉత్పత్తి పెంపు, నేల సారవంతత పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధి మరియు పోషకాహార భద్రతలో కందుల పంట కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మినీకిట్లను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.మండల వ్యవసాయ అధికారి గోల్కొండ ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ... వికారాబాద్ మండలానికి మొత్తం 326 కందుల మినీకిట్లు కేటాయించబడినట్లు తెలిపారు. ప్రతి మినీకిట్‌లో 4 కిలోల నాణ్యమైన కందుల విత్తనం అందజేయబడుతుందని పేర్కొన్నారు. అదనంగా, విత్తన శుద్ధి కోసం రైజోబియం కల్చర్ (Rhizobium Culture) కూడా రైతులకు అందజేయబడుతుందని తెలిపారు. ఈ మినీకిట్లు మరియు రైజోబియం కల్చర్ పూర్తిగా ఉచితంగా రైతులకు పంపిణీ చేయబడుతున్నాయని వివరించారు.మినీకిట్ల పంపిణీని జనరల్, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే మహిళా రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైజోబియం కల్చర్‌తో విత్తన శుద్ధి చేయడం వల్ల వేర్ల వద్ద నత్రజని స్థిరీకరణ పెరిగి పంట ఎదుగుదల మెరుగుపడుతుందని, ఎరువుల ఖర్చు తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు వివరించారు.మినీకిట్ ద్వారా అందించిన విత్తనాలను నిర్దేశించిన విస్తీర్ణంలో మాత్రమే సాగు చేయాలని,రైజోబియం కల్చర్‌తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలని తెలిపారు.సిఫార్సు చేసిన పంట యాజమాన్య పద్ధతులు మరియు సమతుల్య ఎరువుల వినియోగాన్ని పాటించాలని తెలిపారు. కలుపు, పురుగులు మరియు వ్యాధుల నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను అనుసరించాలని కోరారు.మినీకిట్ ద్వారా అందించిన విత్తనాలను ఇతరులకు విక్రయించరాదు లేదా బదిలీ చేయరాదని,వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించే క్షేత్ర పరిశీలనలకు సహకరించాలని అన్నారు.ప్రదర్శన క్షేత్రాలను సక్రమంగా నిర్వహించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ మల్లేశం,ఏడిఏ వెంకటేష్, ఏ ఈ ఓ అయ్యప్ప ,డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.