schedule Wednesday, September 02, 2026

ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలి

calendar_today June 16, 2026
person Prajagalam News
ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, జూన్ 15 (praja galam) : వివిధ ప్రభుత్వాల నుంచి సర్పంచులకు అనుకూలమైన జీవోలు కోర్టు తీర్పులు నిధులు సాధించడంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర సర్పంచుల సంఘం కీలకపాత్ర పోషించిందని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ మాజీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావలసిన నిధుల కోసం సర్పంచులందరం కలిసికట్టుగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల అనంతగిరి గుట్టలో హరితరిసార్ట్ లో ఏర్పాటు చేసిన సర్పంచుల చైతన్య సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చడానికి నిధులు రాబడుదామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి రావలసిన నిధులు, విధులు హక్కుల కోసం సంఘటితంగా పోరాడి సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు. సర్పంచుల సమస్యలను సాధనే లక్ష్యంగా సర్పంచుల సంఘాన్ని 1995 సంవత్సరంలో వైవిబి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. సర్పంచులకు అనుకూలమైన జీవోలు కోర్టు తీర్పులు నిధులు సాధించడంలో సంఘం కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పారు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడుదాం అని ఆయన మరోసారి పిలుపునిచ్చారు.పలువురు సర్పంచులు మాట్లాడుతూ... కొందరు ఉప సర్పంచులు చెక్ పవర్ ను దుర్వినియోగం చేస్తూ.. గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు.ప్రజల చేత స్వయంగా ఎన్నుకున్న సర్పంచులకు మాత్రమే చెక్ పవర్ ఉండేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.ఈ పంచాయతీ యాప్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.సర్పంచులకు గౌరవ వేతనం రూ.25000 ఇవ్వాలని కోరారు.ఇందిరమ్మ కమిటీ రద్దు చేసి సర్పంచులకు పూర్తి బాధ్యత అప్పగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఖమ్మం నరేంద్ర, ప్రధాన కార్యదర్శి బాధేపల్లి సిధార్థ, తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్, మాజీ రాష్ట్ర సర్పంచుల సంఘము అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీపీ ల సంఘము రాష్ట్ర అధ్యక్షులు శ్రీశైలం, మాజీ జడ్పీటీసీల సంఘము రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనన్న, మాజీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘము అధ్యక్షులు మధుసూదన్ గుప్త, ప్రస్తుత రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘము అధ్యక్షులు శివారెడ్డి, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.