September 2, 2026
Prajagalam News
హామీలు ఎక్కడ..? అభివృద్ధి ఏది..?
కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి
తాండూరులో భారీ మహాధర్నా..
వేలాదిగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
• అక్రమ కేసులకు భయపడేది లేదు..
ప్రజల కోసం పోరాటం ఆపేది లేదు”
• మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
(తాండూరు)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో తాండూరులో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీగా తరలివచ్చి ఇందిరాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు.కాంగ్రెస్ ఎన్నికల హామీలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ఈ ఆందోళనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నికల ముందు హామీలతో ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు.మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తమ బాధ్యత అని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడతామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. “ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హామీల అమలు కోసం ప్రజల తరఫున మా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.ఇందిరాచౌక్ పరిసర ప్రాంతాలు బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. భారీ ర్యాలీ, 420 అడుగుల ఫ్లెక్సీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో తాండూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ చేపట్టిన ఈ మహాధర్నా స్థానిక రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.