• బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్
(తాండూర్)
తాండూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల హాస్టల్లో జరిగిన ఘటనపై బీసీ సంఘం తరఫున పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నామని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ తెలిపారు. విద్యార్థుల మధ్య సాధారణ గొడవగా కొందరు చెబుతుండగా, గాయపడిన విద్యార్థి తల్లి మాత్రం తన కుమారుడిని గత కొంతకాలంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో ర్యాగింగ్ జరిగిందా? లేదా? అనే విషయంపై ప్రత్యేకంగా నిష్పక్షపాత విచారణ జరపాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. హాస్టల్లో ఇలాంటి ఘటనకు పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి, గతంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా అనే అంశాలను విచారించాలని, విద్యార్థుల భద్రతకు ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం తేలితే ప్రిన్సిపాల్‌తో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులతో వంటగదిలో చపాతీలు చేయించడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంపైనా విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులతో పనులు చేయించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, బీసీ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, జిల్లా బీసీ నాయకులు ప్రేమ్ కుమార్, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణాచారి, వడ్డెర సమాజం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్, పర్మేష్, దుబాయ్ వెంకట్, కిరణ్, సోషల్ మీడియా ఇన్చార్జ్ బశ్వరాజ్, కిరణ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.