schedule Wednesday, September 02, 2026

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం

calendar_today September 2, 2026
person Prajagalam News
బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం
 

• ప్రజాపాలనలో సంక్షేమం–అభివృద్ధికి పెద్దపీట..

• తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

•  మున్సిపల్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 110 కోట్లతో కాగ్నా నదితో త్రాగునీరు

• తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి

  (తాండూర్)   బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, దాదాపు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని తెలంగాణపై మోపారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి విమర్శించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అనవసర ఆరోపణలు చేస్తూ వాస్తవాలను ప్రజల దృష్టి నుంచి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని మనోహర్‌రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, కొత్త రేషన్‌ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడమే కాకుండా, ఉన్న రేషన్‌ కార్డుల్లో కనీసం పిల్లల పేర్లు కూడా చేర్చని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 35 లక్షల రేషన్‌ కార్డులు అందించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, సుమారు రూ.6 వేల కోట్లతో రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించామని పేర్కొన్నారు.తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నానని మనోహర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సుమారు రూ.110 కోట్ల నిధులతో కాగ్నా నది నుంచి తాగునీటిని తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.తాండూరు పట్టణంతో పాటు యాలాల్‌, యాలాల మండలాలకు చెందిన 14 గ్రామాలకు కూడా తాగునీరు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. విద్యారంగానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. తాండూరులో 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసి కార్పొరేట్‌ స్థాయి విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు.మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చిద్దామని తాము చెబుతున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సమావేశాల నుంచి వెళ్లిపోతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎన్ని గంటలైనా కౌన్సిల్‌లో కూర్చునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.జిల్లా ఆస్పత్రిని తరలిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మనోహర్‌రెడ్డి విమర్శించారు. గత 30 సంవత్సరాల్లో ఐసీయూ సౌకర్యాన్ని తీసుకురాలేని వారు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ సౌకర్యాన్ని మంజూరు చేస్తున్నామని తెలిపారు.అలాగే ఆస్పత్రిలో ల్యాబ్‌ సేవలను మెరుగుపరిచామని, కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆస్పత్రిలో సకాలంలో జీతాలు చెల్లించని ఏజెన్సీలను రద్దు చేసి, సేవలను మరింత మెరుగుపరిచే చర్యలు చేపట్టామని తెలిపారు.తాండూరులో ఏటీసీ సెంటర్‌ను సుమారు రూ.60 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇది కేవలం శిలాఫలకాలకే పరిమితమైన కార్యక్రమం కాదని, వాస్తవంగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని అన్నారు. ఈ కేంద్రం ద్వారా స్థానికంగా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువస్తున్నామని మనోహర్‌రెడ్డి తెలిపారు. తాండూరు–వికారాబాద్‌ రహదారి అభివృద్ధికి పనులు చేపడుతున్నామని చెప్పారు. బషీరాబాద్‌ ప్రాంతంలో రూ.35 కోట్లతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.గతంలో కేవలం జీవోలు, శిలాఫలకాలకే పరిమితమైన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం వాస్తవ రూపంలోకి తీసుకువస్తోందని అన్నారు.కోటిపల్లి ప్రాజెక్టు విషయంలో గత పాలకులు కనీసం చట్టెడు మట్టి కూడా తీయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. తమ ప్రభుత్వం రూ.80 కోట్ల నిధులతో ప్రాజెక్టు పనులు చేపట్టి ఇప్పటికే సుమారు 60 శాతం పనులు పూర్తి చేసిందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సుమారు 9,400 ఎకరాలకు సాగునీరు అందుతుందని, పెద్దేముల్‌ మండలంలోని 14 గ్రామాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. బషీరాబాద్‌లో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీలు కేవలం జీవోలకే పరిమితమయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా బషీరాబాద్‌లో 30 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.తాండూరు నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు hams విధానంలో సుమారు రూ.300 కోట్లతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మనోహర్‌రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి రాకపోకలు సులభతరం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమన్నారు.బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన తప్పిదాల కారణంగానే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు తమపై బట్టకాల్చి మీద వేసే విధంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.బీఆర్‌ఎస్‌ నాయకుల ఆరోపణలను పట్టించుకోకుండా తాండూరు నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ తాండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు.ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సభ్యుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటూ తాండూర్ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆదర్శవంతమైన తాండూర్ పట్టణాన్ని నిర్మించడమే లక్ష్యంగా కౌన్సిలర్స్ పని చేయాలనీ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి , వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ సభ్యులు,మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి,మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు