ఎమ్మెల్యే ఆదేశాలతో దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం!
October 30, 2026
Prajagalam News
• చెత్తాచెదారం తొలగింపుతో ఊపిరి పీల్చుకున్న కాలనీవాసులు
(తాండూర్)
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరోసారి చొరవ చూపారు. పట్టణంలో చాలాకాలంగా పేరుకుపోయిన చెత్తాచెదారం సమస్యను తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించారు. ప్రతి మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్నింగ్ వాక్‌లో భాగంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోట్లి మహారాజ్ కాంప్లెక్స్ ఎదుట, గాంధీనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రం పక్కన చాలాకాలంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆ ప్రాంతాల్లో తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టి, చెత్తాచెదారాన్ని పూర్తిస్థాయిలో తొలగించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.దీర్ఘకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.