schedule Monday, November 02, 2026

వట్టిమీనపల్లిలో శ్రీ అదితి గోక్షేత్రం ప్రారంభోత్సవం

calendar_today November 2, 2026
person Prajagalam News
వట్టిమీనపల్లిలో శ్రీ అదితి గోక్షేత్రం ప్రారంభోత్సవం
 

- ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

- స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆశీస్సులు అందించిన శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ

- గోక్షేత్రం ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా ఎదగాలి: స్పీకర్

  • వికారాబాద్ జిల్లా-:
  • వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలంలోని వట్టిమీనపల్లి గ్రామంలో శ్రీ అదితి గోక్షేత్రం ప్రారంభోత్సవం, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి దేవతా విగ్రహాల దివ్య ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాల్లో తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. అవధూత దత్తపీఠాధిపతి, సాక్షాత్ శ్రీ దత్తాత్రేయ స్వరూపులు అయిన పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య కరకమలముల మీదుగా వట్టిమీనపల్లి గ్రామంలోని గోవర్ధనగిరిలో నూతనంగా నిర్మించిన శ్రీ అదితి గోక్షేత్రం" ప్రారంభమైంది.ఈ శుభసందర్భంలో గోక్షేత్ర ప్రాంగణంలో శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి తదితర దేవతా విగ్రహాల దివ్య ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించారు.శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి ఆశీస్సులు అందించారు.
  • ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... గోశాల ప్రారంభోత్సవం అంటే మన సంస్కృతిని, సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప పవిత్రమైన ప్రయత్నం అని కొనియాడారు. మన భారతీయ సంస్కృతిలో గోవుకు చాలా ప్రాధాన్యత, విశేష స్థానం ఉంది.మన జీవన విధానంలో గోవుకు, మనిషికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెప్పారు.ఇప్పటికీ గ్రామాల్లో వ్యవసాయానికి, గ్రామీణ జీవనానికి, ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి ఎన్నో విధాలుగా తోడ్పడే జీవనాధారం గోవు అని అన్నారు.మన భారతీయ వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో గోమాత గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో మన పెద్దలు, పూర్వీకులు ప్రస్తావించారని గుర్తు చేశారు. మన సంప్రదాయంలో కూడా గోవును సమస్త దేవతల నిలయంగా భావిస్తారు. అందుకే గోపూజకు, గోసేవకు, గోరక్షణకు మన ధర్మంలో ప్రత్యేక స్థానం కల్పించారని అన్నారు.మన సంస్కృతిని, సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను భవిష్యత్ తరాలకు అందించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివరించారు. గోవును పూజించడం అంటే కేవలం ఒక ఆచారాన్ని పాటించడం కాదు. మనకు అన్నం పెట్టే ప్రకృతిని, మనకు జీవనాధారం కల్పించే జీవజాలాన్ని గౌరవించడం అని అన్నారు.శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా గోపాలుడిగా అవతరించి,గోవులతో తన అనుబంధాన్ని ప్రపంచానికి చాటారని,గోవర్ధన గిరిని ఎత్తి, గోకుల ప్రజలను, గోవులను ప్రకృతి విపత్తు నుంచి రక్షించిన ఘట్టం, మనకు ప్రకృతి పరిరక్షణ, జీవరాశుల పట్ల ప్రేమ, సమాజ రక్షణ అనే గొప్ప సందేశాన్ని అందిస్తుందని అన్నారు.మన పండుగలు, పూజలు, ధార్మిక కార్యక్రమాల్లో గోమాతకు విశిష్ట స్థానం ఉంది. గోరక్షణ.. కేవలం ధార్మిక బాధ్యత కాదు, సామాజిక బాధ్యత కూడా అని చెప్పారు.ఈ రోజుల్లో వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో గోశాలల పాత్ర చాలా కీలకంగా ఉందనారు.గోశాల అంటే కేవలం గోవులను ఒకచోట ఉంచే ప్రదేశం కాదు. అది వాటికి ఆశ్రయం కల్పించే సేవా కేంద్రం అని అన్నారు.గోక్షేత్రం కేవలం గోవుల సంరక్షణకే పరిమితం కాకూడదు. ఇది ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా ఎదగాలని అన్నారు.ధర్మం అంటే కేవలం దేవాలయానికి వెళ్లడం కాదు. మన చుట్టూ ఉన్న జీవుల పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించడం కూడా ధర్మమే అని గొప్పగా వివరించారు.మన పిల్లలకు సంపదను మాత్రమే కాదు, సంస్కృతిని కూడా వారసత్వంగా ఇవ్వాలని అన్నారు.అదితి గోక్షేత్రం భవిష్యత్తులో మరెన్నో గోవులకు ఆశ్రయం కల్పిస్తూ, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ, సమాజ సేవకు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.ఈ మహత్తర కార్యక్రమానికి కృషి చేసిన నిర్వాహకులకు, దాతలకు, గోసేవకులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.ఈ పవిత్రమైన కార్యక్రమం విజయవంతం కావాలని, గోమాత ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్వామీజీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతీ యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
  వెంకటేష్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్