schedule Monday, November 02, 2026

వాతావరణానికి అనుగుణంగా రైతులు పంటలు పండించాలి:- వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

calendar_today October 30, 2026
person Prajagalam News
వాతావరణానికి అనుగుణంగా రైతులు పంటలు పండించాలి:- వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
భూగర్భ జలాల పెంపునకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి 
భూసర్వేతో భూసంబంధిత సమస్యలు పరిష్కారించుకోవచ్చు
పీరంపల్లిలో పర్యటించిన వికారాబాద్  జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
కుల్కచర్ల
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా
రైతులు ఆరుతడి పంటల సాగును చేపట్టి, తక్కువ నీటి వనరులతో అధిక దిగుబడులు సాధించే విధంగా వ్యవసాయం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు.
శుక్రవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పీరంపల్లి గ్రామ పంచాయతీలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పర్యటించి వ్యవసాయ పంటలు, భూ సర్వే, వి బి జి రాంజీ పనులు, ప్రాథమిక పాఠశాలను క్షేత్రస్థాయిలో పర్యటించి సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రామంలో సాగు చేస్తున్న వరి, కంది పంటలను పరిశీలించి, పంటల సాగు విధానం, రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్  దీపక్ తివారి మాట్లాడుతూ....
ఆరుతడి పంటల సాగు వల్ల నీటి వినియోగం తగ్గడంతో పాటు రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతులకు ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కల్పించి, ఆరుతడి పంటల సాగును చేపట్టేలా ప్రోత్సహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు కూరగాయ, ఉద్యానవన పంటలు సాగు చేసుకునేలా అధికారులు రైతుల్లో అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.భూ సర్వే ద్వారా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. భూమి రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించి భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పాఠశాలలోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువుపై కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలకు సంబంధించి అదనపు తరగతి గదులను, కిచెన్ షెడ్ నిర్మాణ పనులను వి బి జి రామ్ జి కింద చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలకు కేటాయించిన 2 ఎకరాల భూమిని సర్వే నిర్వహించి నిర్ధారించాలని తహసిల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం గ్రామంలో జరుగుతున్న వి.బి.జి. రామ్ జి పనుల పురోగతిని పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి, రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రైతులు పంట పొలాల్లో వి బి జి రామ్ జి కింద నీటి గుంతలు (ఫామ్ పాండ్స్ ) ఏర్పాటు చేసుకునే విధంగా అధికారులకు రైతులకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ పర్యటనలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, వ్యవసాయ అధికారి కవిత, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ మధుసూదన్, డిఇఓ మహమ్మద్ అబ్దుల్ ఘని, అదనపు డిఆర్డిఓ సత్తయ్య, తహసిల్దార్ పురుషోత్తం,ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు,ఎంపిఓ భాస్కర్ గౌడ్, సర్పంచ్ వెంకటయ్య లతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.