• గత ఎమ్మెల్యేలా ఉత్తుత్తి జీవోలు కావు.. నిజమైన జీవోలు
• అభివృద్ధి ఆధారాలతో కాంగ్రెస్ ‘బ్రోచర్’ విడుదల.
• ఆధారాలతో చర్చకు రావాలని బీఆర్ఎస్ కు సవాల్
(తాండూరు)
తాండూరు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నాయకులు గణాంకాలు, అభివృద్ధి పనుల వివరాలతో సమాధానం ఇచ్చారు. గత 1000 రోజుల ప్రజాపాలనలో తాండూరు నియోజకవర్గానికి సుమారు రూ.1200 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు. ఇవి కేవలం కాగితాలపై ఉన్న ఉత్తుత్తి జీవోలు కాదని, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న నిజమైన జీవోలని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు బాల్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి కె.గోపాల్, కౌన్సిలర్ ఎల్లప్ప లతో కలిసి 1000 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనుల సమగ్ర వివరాలతో రూపొందించిన ‘అభివృద్ధి బ్రోచర్’ను విడుదల చేశారు.తాండూరు నియోజకవర్గంలో రహదారులు, తాగునీటి ప్రాజెక్టులు, డ్రైనేజీలు, విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, ఇందిరమ్మ ఇళ్లు, కమ్యూనిటీ భవనాలు, విద్యుత్ సదుపాయాలు తదితర రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా మంజూరైన నిధులు, చేపట్టిన పనులు, వాటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే బ్రోచర్‌ను రూపొందించినట్లు చెప్పారు. “జీవోలు చూపించి అభివృద్ధి జరిగిందని చెప్పడం కాదు.. పనులు ఎక్కడ జరిగాయో ప్రజలే చూస్తున్నారు” అని పేర్కొన్నారు. అభివృద్ధి బ్రోచర్‌లో పేర్కొన్న వివరాలు తప్పని నిరూపించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటే ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం కాదు విడుదల చేసిన గణాంకాలు, అభివృద్ధి పనుల వివరాలపై ఆధారాలతో మాట్లాడాలని సూచించారు.తాండూరు ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారని, కేవలం రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే రాజకీయాలను ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చేశామని అంటున్నారని నియోజకవర్గానికి రావాల్సిన నిధులు ఎందుకు విడుదల కాలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. నిధులు విడుదల కాకపోవడానికి కారణాలేమిటో, అభివృద్ధి కోసం రావాల్సిన నిధులు ఎక్కడికి వెళ్లాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గతంలో పెండింగ్‌లో ఉన్న అనేక అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.గత 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని నాయకులు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామం, ప్రతి పట్టణ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాకుండా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోందని, అదే తరహాలో తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.“1000 రోజుల పాలన.. రూ.1200 కోట్ల అభివృద్ధి.. ఇవి ఉత్తుత్తి జీవోలు కాదని వారు స్పష్టం చేశారు.