భద్రేశ్వర ఆలయ అన్నసత్రం దాసోహానికి రూ.40 లక్షల జీవో తెచ్చిన ఘనత ఎమ్మెల్యేదే
calendar_today
September 5, 2026
person
Prajagalam News
• ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదు
• ఎమ్మెల్యే సహకారం, వీరశైవ సమాజం భాగస్వామ్యంతో 100 రోజుల్లో అన్నసత్రం దాసోహం పూర్తి
• భద్రేశ్వర దేవాలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్
(తాండూరు)
భద్రేశ్వర ఆలయ అభివృద్ధి, అన్నసత్రం దాసోహం వంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అందిస్తున్న సహకారాన్ని విస్మరించి బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త కరుణాకర్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని భద్రేశ్వర దేవాలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధపు ఆరోపణలు చేయడం సరికాదని, నిజం ఎప్పటికైనా బట్టబయలవుతుందని హెచ్చరించారు. భద్రేశ్వర ఆలయంలో అన్నసత్రం దాసోహం కోసం రూ.40 లక్షల జీవో మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికే దక్కుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో, అనంతరం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఎమ్మెల్యే మాట తప్పే వ్యక్తి కాదని అన్నారు. అన్నసత్ర దాసోహం అభివృద్ధికి ఇప్పటికే రూ.40 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే, ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మరో రూ.25 లక్షలు మంజూరు చేయనున్నారని తెలిపారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారం, వీరశైవ సమాజం సభ్యుల సమష్టి కృషితో కేవలం 100 రోజుల్లోనే అన్నసత్రం దాసోహం పనులను పూర్తి చేయగలిగామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యేకు సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.తనను భద్రేశ్వర ఆలయ చైర్మన్‌గా నియమించే సమయంలో కొందరు కుట్రలు, అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాజకీయ స్వార్థాలతో విమర్శలు చేయడం తగదని అన్నారు. "స్థాయిని మరిచి మా ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీది కాదు" అని కరుణాకర్‌ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.అభివృద్ధి పనులపై మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు మాటలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. చేసిన అభివృద్ధి పనులు, మంజూరైన నిధులు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలు అన్నీ ప్రజల ముందే ఉన్నాయని తెలిపారు.వాస్తవాలను ప్రజల ముందు ఉంచకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, భద్రేశ్వర ఆలయ అభివృద్ధి కోసం అందరూ రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.